కరోనా సోకితే పది రోజులే చికిత్స... ఆపై పరీక్షలు లేకుండానే ఇంటికి: తెలంగాణలో అమలు!

  • చికిత్స తరువాత వారం రోజుల హోమ్ ఐసొలేషన్
  • ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు 17 రోజుల క్వారంటైన్
  • సహాయకులకు హైడ్రాక్వీ క్లోరోక్విన్ టాబ్లెట్లు
  • ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అమలు చేస్తామన్న ఈటల
తెలంగాణ రోగులకు చికిత్సా విధానం విషయంలో ఐసీఎంఆర్ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తాజాగా నిర్దేశించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయనున్నామని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. వ్యాధి సోకితే, పది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేస్తామని, ఆపై ఎటువంటి పరీక్షలు లేకుండానే డిశ్చార్జ్ చేసి, వారం రోజుల పాటు హోమ్ ఐసొలేషన్ లో ఉంచాలని ఐసీఎంఆర్ సూచించిందని, ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉంటేనే ఆసుపత్రిలో చికిత్స అందించాలని చెప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. ఐసీఎంఆర్ తాజా సూచనలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఈటల, ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే డెత్ గైడ్ లైన్స్ ను కూడా అమలు చేయనున్నామని అన్నారు.

క్యాన్సర్ సహా, ఇతర జబ్బులు ఉండి కరోనా సోకి మరణిస్తే, వారు దీర్ఘకాలిక వ్యాధులతోనే చనిపోయినట్టుగా పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. మరణాలకు గల కారణాలను ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తుందని తెలిపారు. వారిచ్చే డెత్ ఆడిట్ రిపోర్టు ప్రకారమే మరణాలను ప్రకటించాలన్న ఐసీఎంఆర్ సూచనలకు అనుగుణంగా రిపోర్టులను తయారు చేస్తున్నామని తెలిపారు.

ఇక హోమ్ ఐసొలేషన్ సూచనల ప్రకారం, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కాంటాక్ట్ లకు వ్యాధి లక్షణాలు కనిపించకుంటే, ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. వారిని ఓ ప్రత్యేక గదిలో 17 రోజులు పర్యవేక్షణలో ఉంచి, రోగులకు సాయంగా ఓ వ్యక్తిని ఉంచి, అతనికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లు అందిస్తామని, వారిని వైద్య బృందాలు రెండు పూటలా పర్యవేక్షిస్తారని, ఆ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలను స్వయంగా అందిస్తామని తెలిపారు.

ఈ మొత్తం ప్రాసెస్ ను సమన్వయం చేసేందుకు ఓ నోడల్ అధికారిని నియమించామని, హైదరాబాద్ లో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల అధికారులతో తాను మాట్లాడానని ఈటల రాజేందర్ తెలిపారు. ఒకే కుటుంబాలకు చెందిన వారికే కేసులు వస్తున్నాయని, అందుకే కేసులు పెరుగుతున్నాయని, లక్షణాలు కనిపించిన వారందరికీ చికిత్సను అందిస్తున్నామని ఆయన అన్నారు. 


More Telugu News