ఓ దళిత డాక్టర్ ను తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం జగన్ ఉన్మాదానికి పరాకాష్ఠ: నారా లోకేశ్

  • వీడియో ట్వీట్ చేసిన లోకేశ్
  • జగన్ ది క్రూర మనస్తత్వం అంటూ వ్యాఖ్యలు
  • మూల్యం చెల్లించుకోక తప్పదంటూ హెచ్చరిక
వైఎస్ జగన్ ది క్రూరమైన మనస్తత్వం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా విమర్శించారు. ఓ దళిత డాక్టర్ ను తాళ్లతో కట్టేసి, లాఠీలతో కొట్టించడం జగన్ ఉన్మాదానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ ఇవ్వమని వేడుకున్న డాక్టర్ సుధాకర్ ను నియంతలా సస్పెండ్ చేశారని ఆరోపించారు. నిజాలు బయటపెట్టిన ఉత్తమ వైద్యుడైన సుధాకర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.

కాగా, ఓ డాక్టర్ ను చేతులు కట్టేసి కొట్టడం హేయం అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ పై దాడి దారుణం అంటూ స్పందించారు. ఈ దారుణ ఘటనకు బాధ్యత సీఎం జగన్ దేనని అన్నారు. ఇది దళితులపై జరిగిన దాడి అని, వైద్య వృత్తిపై జరిగిన దాడి అని ఆరోపించారు. ప్రశ్నించే వ్యక్తులను హింసిస్తారా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఓ మాస్క్ అడగడమే ఆ వైద్యుడు చేసిన నేరమా? అని నిలదీశారు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ ను సస్పెండ్ చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News