ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలి: రాహుల్ గాంధీ

  • పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి
  • వారి బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమచేయాలి
  • దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలి
  • భారత నిర్మాణంలో వలస కార్మికులదే కీలక పాత్ర
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు, వలసకూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. 'పేదలకు నేరుగా నగదు సాయం చేయాలి.. వారి బ్యాంకు ఖాతాల్లో సాయాన్ని జమచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతున్నాను' అని చెప్పారు.

'చిన్న వ్యాపారులకు ప్రకటించిన ప్యాకేజీని నిజాయతీగా అమలు చేయాలి. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాలి. భారత నిర్మాణంలో వలస కార్మికులదే కీలక పాత్ర. భవిష్యత్తులోనూ వారు కీలక భాగస్వాములుగా ఉంటారు. వలస కార్మికులకు ఇప్పుడు డబ్బు అవసరం' అని రాహుల్ గాంధీ తెలిపారు.

'ప్రభుత్వం వారికి సాయాన్ని అందించాలి. లాక్‌డౌన్‌ సమయంలో పేదలు, కూలీలు పడుతున్న ఆవేదనను చూపిస్తోన్న జర్నలిస్టులకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.  కరోనా కంటే ఆర్థిక నష్టం మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ప్యాకేజీ విషయంలో ప్రధాని మోదీ పునరాలోచించాలని కోరారు.

జీవనోపాధి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అన్ని లెక్కలు వేసుకుంటూ లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఆయన కోరారు. మన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించాలని ఆయన అన్నారు. అలాగే, వలసదారుల పరిస్థితికి ఎవరు బాధ్యత వహించాలనే విషయంపై ప్రస్తుత పరిస్థితులు వేలెత్తి చూపించే సమయానికి సరిగ్గాలేవని అన్నారు. వలసదారుల సమస్య దేశానికి ఇప్పుడు సవాలుగా మారిందన్నారు.
 
గ్రామాల్లో 200 రోజుల పాటు ఉపాధి హామీ పనిదినాలు కల్పించాలన్నారు. ఉపాధి హామీ డబ్బులు రెట్టింపు చేయాలని, విపక్షాల సూచనలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వలస కార్మికులతో పాటు భావిభారత చిన్నారులు సైతం రోడ్లపై వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, డబ్బులు లేక పేద ప్రజలు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల ఆర్థిక ప్యాకేజీని సరైన రీతిలో పేదలకు అందేలా చేయాలని రాహుల్ కోరారు.



More Telugu News