మంచంపై బాలుడిని పడుకోబెట్టి.. 1,300 కి.మీ మోసుకెళ్లిన వైనం.. వీడియో ఇదిగో

  • పంజాబ్‌లోని లుధియానా నుంచి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి ప్రయాణం
  • బాలుడి మెడకి గాయం కావడంతో మంచంపై తీసుకెళ్లిన వైనం
  • యూపీలోని కాన్పూర్‌ చెక్‌పోస్టు చేరుకున్నాక గుర్తించిన పోలీసులు
  • ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపిన పోలీసులు
మంచంపై ఓ బాలుడిని పడుకోబెట్టి దాదాపు 1,300 కిలోమీటర్లు అతడి కుటుంబ సభ్యులు భుజాన మోసుకెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఓ జాతీయ మీడియాకు లభ్యమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పంజాబ్‌లోని లుధియానా నుంచి సొంత గ్రామం మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలికి ఆ కుటుంబం వెళ్లాలనుకుంది. అయితే, ఆ కుటుంబంలోని ఓ అబ్బాయికి మెడ భాగంలో గాయమైంది.

దీంతో అతడు నడవలేని పరిస్థితి తలెత్తింది. లుధియానాలోనే ఉంటే తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి రావచ్చని చేసేదేమీ లేక ఓ మంచంపై ఆ బాలుడిని పడుకోబెట్టి కుటుంబ సభ్యులు మోసుకెళ్లారు. ఇలా వారు దాదాపు 15 రోజులు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో పలు చోట్ల ఆగి ఆహారం తిని నిద్రపోతున్నారు. వారు నడుస్తున్న సమయంలో వారి కాళ్లకు చెప్పులు కూడా లేవు.

దీంతో వారి కాళ్లకు బొబ్బలెక్కాయి. వారు 15 రోజులు నడిచి యూపీలోని కాన్పూర్‌ చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాక పోలీసులు వారి గురించి తెలుసుకుని ఓ వాహనం ఏర్పాటు చేసి సొంతూరికి పంపారు. పిల్లలతో పాటు తాము మొత్తం 17 మంది సింగ్రౌలికి కాలినడకన వెళ్తున్నామని ఆ కుటుంబం మీడియాకు తెలిపింది. సొంత గ్రామాలకు వెళ్లడానికి దేశంలో వేలాది మంది వలస కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారు.


More Telugu News