డిజిటల్ చెల్లింపులపైనా కరోనా ప్రభావం... 46 శాతం క్షీణత

  • మార్చి నెలలో రూ.156.5 ట్రిలియన్ల మేర లావాదేవీలు
  • గతేడాది మార్చితో పోల్చితే తక్కువ
  • లాక్ డౌన్ కారణంగా మందగించిన ఆర్థిక కార్యకలాపాలు
దేశంలో కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ డిజిటల్ చెల్లింపులపైనా ప్రభావం చూపింది. గతేడాది ఇదే సీజన్ తో పోల్చితే చెల్లింపుల శాతం బాగా తగ్గింది. లాక్ డౌన్ కారణంగా వివిధ పరిస్థితుల నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయని భావించినా, ఆర్థిక మందగమనం కారణంగా మార్చి నెల చెల్లింపుల్లో 46 శాతం క్షీణత కనిపించింది. మార్చి నెలలో జరిగిన డిజిటల్ ఆర్థిక లావాదేవీల విలువ రూ.156.5 ట్రిలియన్లు కాగా, గతేడాది మార్చి నెలతో పోల్చితే బాగా తక్కువ. గత మార్చి మాసంలో రూ.292 ట్రిలియన్ల డిజిటల్ పేమెంట్లు జరిగాయి.

ఈ మార్చిలో ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడం కూడా బాగా తగ్గినట్టు గుర్తించారు. ఏటీఎం విత్ డ్రాయల్స్ లో 13 శాతం క్షీణత నమోదైంది. పీఓఎస్ యంత్రాల వద్ద డెబిట్ కార్డులు ఉపయోగించడంలోనూ ఇదే పరిస్థితి! మార్చిలో 25 శాతం తగ్గుదలతో రూ.27,238 కోట్ల లావాదేవీలే జరిగాయట. క్రెడిట్ కార్డుల పరిస్థితీ అందుకు భిన్నం కాదు. 20 శాతం తగ్గుదలతో రూ.26,656 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. లాక్ డౌన్ కారణంగా ఈ-కామర్స్ సైట్ల కార్యకలాపాలు పరిమితం కావడంతో ఈ రంగంలోనూ 18.5 శాతం క్షీణత నమోదైంది.


More Telugu News