బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు 1902కు ఫోన్ చేయాలి: జగన్‌

  • రైతు భరోసా పథకం నిధుల విడుదల
  • ఈ నెల 30న 10,641 రైతు భరోసా కేంద్రాల ప్రారంభం
  • ఏయే పంటలు వేయాలనే సూచనలు ఇస్తారు
  • ప్రస్తుతం ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500
రైతు భరోసా సొమ్మును రైతుల పాత అప్పుల కింద జమ చేసుకోవద్దని బ్యాంకు అధికారులకు ముందే చెప్పామని, బ్యాంకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు 1902కు ఫోన్ చేయాలని ఏపీ సీఎం జగన్ చెప్పారు. తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతు భరోసా పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... 'నేరుగా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తే పరిష్కారం చేస్తాం. నేను స్వయంగా రాసిన లేఖను ప్రతి రైతుకు పంపుతున్నాం. అక్నాలెడ్జ్‌ స్లిప్‌ కూడా రైతు నుంచి తీసుకోవాలని ఆదేశించాను. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది. ఈ నెల 30న 10,641 రైతు భరోసా కేంద్రాలను ఆవిష్కరిస్తున్నాం.  ఏయే పంటలు వేయాలనే సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎలా ఉంటుందన్న విషయాలు చెబుతారు' అని తెలిపారు.

కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందించి సరికొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జగన్ అన్నారు. కాగా, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి గత నెలలో రెండు వేలు జమ చేయగా ఇప్పుడు రూ.5500 జమ చేస్తున్నారు. అంటే తొలి విడతగా రూ.7,500 జమ చేసినట్టు అవుతుంది. అక్టోబర్ నెలలో 2వ విడతగా రబీ అవసరాల కోసం, 3వ విడతగా సంక్రాంతికి  రైతులకు పెట్టుబడి సాయంగా కూడా ప్రభుత్వం జమ చేయనుంది.  


More Telugu News