వలస కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి: టీడీపీ నేత సోమిరెడ్డి ఫైర్

  • లాక్ డౌన్ కు ముందే వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపాల్సింది
  • పోనీ, వారం రోజుల తర్వాత అయినా ఆ పని చేయాల్సింది
  • రెండు నెలల పాటు ఇబ్బంది పడ్డాక కేంద్రం ప్యాకేజ్ ప్రకటించింది!
మన దేశంలో వలస కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వారి బాధలు చూస్తుంటే మనసు కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి భారతీయులుగా మనం తలదించుకునే పరిస్థితి అని, ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యులని, వారిని చాలా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. లాక్ డౌన్ ప్రకటనకు ముందే వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాల్సింది కానీ,అలా చేయలేకపోయారు కనుక ఆ ప్రకటన వెలువడ్డ వారం రోజుల తర్వాత అయినా ఆ పని చేసి ఉంటే బాగుండేదని అన్నారు. పీఎం కేర్స్, ముఖ్యమంత్రుల సహాయనిధులకు వేల కోట్ల రూపాయల నిధులు వస్తే ఏం చేశారు? అని ప్రశ్నించారు.

వలస కార్మికులు కొంత మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారని, తమ స్వస్థలాలకు వెళ్లేందుకు వందల కిలో మీటర్లు నడుస్తున్నారని.. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చూస్తూ ఊరుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. పీఎం కేర్స్ , సీఎం కేర్స్ కు వస్తున్న నిధులను వీరి కోసం ఖర్చుపెట్టలేరా? అని ప్రశ్నించారు. వలస కార్మికులు బతికుండగానే వారికి నరకం ఏంటో చూపించామని ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. రెండు నెలల పాటు వలస కార్మికులు ఇబ్బంది పడిన తర్వాత వారి కోసం కేంద్రం ప్యాకేజ్ ప్రకటించిందని విమర్శలు చేశారు. పార్టీలకు అతీతంగా తాను మాట్లాడుతున్నానని, ‘ఇది కరెక్టు కాదు’ అని అన్నారు.


More Telugu News