దారుణం.. కరోనా పేరుతో మణిపూర్ యువతిపై దాడి

  • హర్యానాలోని గురుగ్రామ్‌లో ఘటన
  • స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తుండగా ఆపిన పెద్దావిడ
  • కరోనా వ్యాప్తి చేస్తున్నావంటూ కర్రతో దాడి
దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్ర ప్రజలపై ఇటీవల దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా హర్యానాలో మణిపూర్‌కు చెందిన ఓ యువతిపై కొందరు దాడిచేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు చైనీయులను పోలి వుండడంతో కరోనా భయంతో వారిపై దాడులకు దిగుతున్నారు. తాజాగా, గురుగ్రామ్‌లోని ఫైజాపూర్‌లో 20 ఏళ్ల మణిపూర్ యువతి చోంగ్ హోయి మిసావోపై కొందరు స్థానికులు ‘కరోనా’ అని పిలుస్తూ అల్లరి చేయడమే కాకుండా ఆ తర్వాత దాడిచేసి దారుణంగా కొట్టారంటూ బాధిత యువతి బోరున విలపించింది.

గ్రామంలోని స్నేహితురాలిని కలిసేందుకు వెళ్లానని, భౌతిక దూరం పాటిస్తూ వారింట్లో భోజనం చేశానని యువతి తెలిపింది. అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ పెద్దావిడ తనను ఆపి కరోనా వైరస్‌ను వ్యాపింపజేస్తున్నావంటూ నిందించిందని, రహదారిపైకి వెళ్లొద్దంటూ బెదిరించిందని తెలిపింది. అక్కడితో ఆగకుండా కర్రతో తనపై దాడిచేసిందని, ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు కూడా తనపై దాడిచేశారని విలపించింది.


More Telugu News