ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు కరోనా ముప్పు ఎక్కువంటున్న చైనా పరిశోధకులు

  • కరోనా రోగులపై సదరన్ యూనివర్సిటీ అధ్యయనం
  • ఏ, ఓ గ్రూపు వ్యక్తులపై పరిశోధనలు
  • కరోనా ప్రభావం చూపే తీరులో తేడా ఉందన్న పరిశోధకులు
చైనాలో కొన్నినెలల కిందట ఓ కొత్త వైరస్ వ్యాపిస్తోందన్న వార్తలను అప్పట్లో ప్రపంచ దేశాలు తేలిగ్గానే తీసుకున్నాయి. కానీ తమ వరకు వస్తే గానీ తెలియదన్నట్టు ఇప్పుడు ప్రతి దేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 43 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా, 2.93 లక్షల మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఓవైపు ఈ వైరస్ భూతాన్ని కట్టడి చేసే సరైన వ్యాక్సిన్ కోసం భారీ ఎత్తున పరిశోధనలు సాగుతుండగా, మరోవైపు సమర్థవంతమైన ఔషధాల కోసం ప్రయోగశాలల్లో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో చైనాలోని సదరన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా వైరస్ కొన్నిరకాల బ్లడ్ గ్రూపులపై తీవ్ర ప్రభావం చూపుతోందని, మరికొన్ని రకాల బ్లడ్ గ్రూపులపై ఓ మోస్తరు ప్రభావం మాత్రమే చూపుతోందని గుర్తించారు. ఈ మేరకు ఓ అధ్యయనంలో వెల్లడించారు. 'ఏ' బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులకు కరోనా నుంచి అధిక ముప్పు ఉంటుందని, వారికి సోకితే తప్పకుండా ఆసుపత్రికి వెళ్లాల్సినంత తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకులు వివరించారు. ఇక, ఓ బ్లడ్ గ్రూపు కలిగిన వ్యక్తులకు కరోనా సోకినా వారిలో ఓ మోస్తరు లక్షణాలే కనిపిస్తాయని, పెద్దగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని అధ్యయనంలో పేర్కొన్నారు.

ఈ అధ్యయనం కోసం సదరన్ యూనివర్సిటీ పరిశోధకులు 2,173 మంది కరోనా రోగులపై పరిశోధన చేపట్టారు. ఆసుపత్రుల పాలైన కరోనా రోగుల్లో 'ఏ' బ్లడ్ గ్రూపు వారే ఎక్కువగా ఉండగా, 'ఓ' గ్రూపు వారు తక్కువ సంఖ్యలో ఉన్నట్టు వెల్లడైంది. దీనిపై వర్సిటీ పరిశోధకులు మాట్లాడుతూ, తమ అధ్యయనం భవిష్యత్ పరిశోధనలకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఏ, బీ, ఓ బ్లడ్ గ్రూపుల వ్యక్తులకు కరోనా సోకే తీరులో తారతమ్యాలు ఎందుకున్నది గుర్తిస్తే పరిశోధనల్లో మరింత పురోగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.


More Telugu News