చాలా కాలం తరువాత తెలుగులోకి సిమ్రాన్ రీ ఎంట్రీ

  • నిన్నటితరం కథానాయికగా సిమ్రాన్
  • స్టార్ హీరోల సరసన వరుస విజయాలు
  • రాజ్ తరుణ్ సినిమాతో రీ ఎంట్రీ  
తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం కథానాయికగా సిమ్రాన్ ఒక వెలుగు వెలిగింది. పెళ్లి తరువాత సినిమాలను దూరం పెట్టిన ఆమె, ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో తెలుగులోనూ రీ ఎంట్రీ ఇస్తుందని అభిమానులు భావించారు. కానీ ఆమె తెలుగు సినిమాలకి మాత్రం దూరంగానే ఉండిపోయింది.

ఇక్కడి స్టార్ హీరోలతో కలిసి తెరపై ఒక రేంజ్ లో సందడి చేసిన ఆమె, మళ్లీ ఈ వైపు  రాకపోవడం అభిమానులను నిరాశపరిచింది. తెలుగులో చెప్పుకోదగిన పాత్రలు రాకపోవడం వల్లనే తాను చేయడం లేదని ఆమె కొన్ని ఇంటర్వ్యూల్లో చెబుతూ వచ్చింది. అలాంటి సిమ్రాన్ దాదాపు పుష్కరకాలం తరువాత తెలుగులో ఒక సినిమాకి చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. రాజ్ తరుణ్ హీరోగా సంతోష్ మోహన్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందనుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం సిమ్రాన్ ను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. సిమ్రాన్ అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.


More Telugu News