ఏడాది పాటు తన వేతనంలో 30 శాతం విరాళంగా ఇవ్వాలని రాష్ట్రపతి నిర్ణయం

  • ఇప్పటికే ఓ నెల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్ కు ఇచ్చిన కోవింద్
  • రాష్ట్రపతిభవన్ లో ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రణాళిక
  •  కేంద్రంలో వనరులను పరస్పరం పంచుకోవాలని నిర్ణయం
లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు. తాజాగా, ఏడాదిపాటు తన వేతనంలో 30 శాతాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు.

అంతేకాదు, రాష్ట్రపతిభవన్ లో ఖర్చులు కూడా భారీగా తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎట్ హోమ్ వేడుకలు, ఇతర ముఖ్య కార్యక్రమాల్లో ఆడంబరాలకు పోకుండా కనీస ఏర్పాట్లతో సర్దుకుపోవాలని రాష్ట్రపతిభవన్ వర్గాలు భావిస్తున్నాయి. కొద్దిమంది అతిథులతో భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ, తక్కువ పూల వినియోగం, స్వల్ప స్థాయిలో అలంకరణలు, ఆహార మెనూలో కోతలు తదితర అంశాలతో పొదుపు చేయాలని తీర్మానించారు.

అంతేకాదు, అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగించే ఖరీదైన, విలాసవంతమైన లిమోసిన్ కారును కొనుగోలు చేయాలన్న ఆలోచనను కూడా రామ్ నాథ్ కోవింద్ విరమించుకున్నారు. రాష్ట్రపతిభవన్, కేంద్రం వద్ద అందుబాటులో ఉన్న వనరులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ సర్దుబాటు ధోరణిలో వ్యవహరించాలని ఆయా వర్గాల యోచన. దేశీయ పర్యటనలు, కార్యక్రమాలు తగ్గించుకుని, టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు చేరువలో ఉండాలని రాష్ట్రపతి భావిస్తున్నారని రాష్ట్రపతిభవన్ వర్గాలు పేర్కొన్నాయి.


More Telugu News