కువైట్ నుంచి మా వాళ్లను తీసుకురావడానికి విమానాలను ఏర్పాటు చేయండి: విదేశాంగ మంత్రికి జగన్ విజ్ఞప్తి

  • కువైట్ లో వేలాది మంది వలస కూలీలు చిక్కుకుపోయారు
  • ఉపాధి కోల్పోయి, అరకొర భోజనం చేస్తూ బతుకుతున్నారు
  • విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలను ఏర్పాటు చేయండి
కువైట్ లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు విమాన ఏర్పాట్లను చేయాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్ కు ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలకు నేరుగా విమానాలను ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి రప్పించేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ ప్రశంసనీయమని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో వేలాది మంది భారతీయులు వెనక్కి వస్తున్నారని తెలిపారు.

అయితే గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి అక్కడే చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులు కష్టాలు పడుతున్నారని జగన్ చెప్పారు. స్వదేశానికి రావడానికి ప్రయాణ ఖర్చును భరించే స్థితిలో వారు లేరని తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ఫీజును మాఫీ చేసి, వారందరికి ఎగ్జిట్ క్లియరెన్స్ ను మన దేశ రాయబార కార్యాలయం ఇచ్చిందని జగన్ చెప్పారు. వారి ప్రయాణ ఖర్చును భరించేందుకు కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. వెంటనే కువైట్ లో ఉన్న హైకమిషనర్ కు సూచనలు చేసి... ఏపీకి విమానాలు ఏర్పాటు చేసేలా చూడాలని విన్నవించారు. తిరిగి వచ్చే వలస కూలీలకు అవసరమైన వైద్య పరీక్షలను నిర్వహించి, వారిని క్వారంటైన్ కు పంపించడానికి అన్ని సదుపాయాలను సిద్ధంగా ఉంచుకున్నామని జగన్ చెప్పారు.

ప్రస్తుతం కువైట్ లో ఉన్న వలస కూలీలంతా అక్కడ ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని జగన్ చెప్పారు. అరకొర భోజనం, కనీస సదుపాయాలు లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశానికి రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారని అన్నారు.


More Telugu News