ప్రధాని మరోసారి తప్పుడు హామీ ఇచ్చారు: అఖిలేశ్ ఫైర్

  • నిన్న రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన మోదీ
  • 133 కోట్ల మందిని మళ్లీ మోసం చేశారన్న అఖిల్
  • మీ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న
ప్రధాని మోదీ నిన్న రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మోదీపై యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. 133 కోట్ల మంది భారతీయులకు మోదీ మళ్లీ తప్పుడు హామీ ఇచ్చారని మండిపడ్డారు.

గతంలో మోదీ రూ. 15 లక్షల కోట్లు ప్రకటించారని.... ఇప్పుడు రూ. 20 లక్షల కోట్లు ప్రకటించారని చెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారని మోదీని ఉద్దేశించి ప్రశ్నించారు. రూ. 20 లక్షల కోట్లలో ఎన్ని సున్నాలున్నాయనే విషయాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని... ప్రధాని ఇస్తున్న హామీలను మాత్రమే చూస్తున్నారని చెప్పారు.

మరోవైపు నిన్న మోదీ మాట్లాడుతూ, ఈ ప్యాకేజీ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. మోదీ ప్రకటించిన ప్యాకేజీపై పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.


More Telugu News