న్యూయార్క్ లో కరోనా మరోరూపం... ఎర్రగామారి, ఉబ్బిపోతున్న చిన్నారుల రక్తనాళాలు!

  • కరోనా హాట్ స్పాట్ గా న్యూయార్క్
  • 100 మంది పిల్లల్లో లక్షణాలు, ముగ్గురి మృతి
  • ఆందోళన కలిగిస్తున్న కొత్త మహమ్మారి
ప్రపంచంలోనే కరోనా వైరస్ అత్యధికంగా వ్యాపించిన నగరాల్లో ఒకటైన న్యూయార్క్, ఇప్పుడు మరో ముప్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. కరోనా వైరస్ రూపాంతరం చెంది, చిన్నారుల్లో భయంకరమైన ప్రభావాన్ని చూపిస్తోంది. 'కవాసకీ డిసీజ్' లక్షణాలు చిన్నారుల్లో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకూ 100 మందికి పైగా పిల్లలకు ఈ రోగ లక్షణాలు కనిపించాయని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో వెల్లడించారు. ఈ వ్యాధితో బాధపడుతూ ఐదేళ్ల, ఏడేళ్ల బాలురిద్దరు, 18 సంవత్సరాల అమ్మాయి మరణించారని ఆయన అన్నారు.

కాగా, వైద్య పరిభాషలో కవాసకీ డిసీజ్ లక్షణాలను పరిశీలిస్తే, ఇది రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తనాళాలు ఎర్రగా మారి ఉబ్బిపోతాయి. జ్వరం వస్తుంది. ఈ లక్షణాలు మూడు దశల్లో కనిపిస్తాయి. సాధారణంగా ఇది ఐదేళ్లలోపున్న పిల్లలకు సోకుతుంది. కానీ న్యూయార్క్ లో 18 ఏళ్ల అమ్మాయి కూడా ఇవే లక్షణాలతో మరణించడం ఇప్పుడు అక్కడి వారిలో ఆందోళన కలిగిస్తోంది.

దీనిపై మరింత వివరణ ఇచ్చిన ఆండ్రూ కూమో, "ఇది ఏదో ఇప్పుడే మొదలైంది. పైకి కనిపిస్తున్న లక్షణాలన్నీ కవాసకీ డిసీజ్ లేదా టాక్సిస్ షాక్ సిండ్రోమ్ లా కనిపిస్తున్నాయి. కొవిడ్ వైరస్ నుంచే ఇది సంభవించిందని భావిస్తున్నాము" అని అన్నారు. రక్త నాళాలపై తొలుత ప్రభావం చూపే ఈ వైరస్, ఆపై గుండెపైనా ప్రభావం చూపుతోందని, న్యూయార్క్ లో కనిపిస్తున్న ఈ మరో మహమ్మారి ఇతర రాష్ట్రాల్లోనూ ఉండే అవకాశాలున్నాయని, ఈ వ్యాధి కనిపిస్తున్న చిన్నారుల్లో కరోనా లక్షణాలు మాత్రం కనిపించడం లేదని తెలిపారు.

వాస్తవానికి కవాసకీ డిసీజ్ చాలా అరుదుగా వస్తుంటుంది. యూఎస్ లో ఏడాదికి దాదాపు 20 వేల కేసుల వరకూ నమోదవుతుంటాయి. సాధారణంగా లభించే యాస్ప్రిన్ మందుతోనే నయమవుతూ ఉంటుంది. న్యూయార్క్ లో ఈ లక్షణాలు కనిపిస్తున్న వారిలో 29 శాతం మంది ఐదేళ్ల నుంచి 9 సంవత్సరాల మధ్య వయసు కాగా, 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 28 శాతం ఉన్నారని తెలుస్తోంది.


More Telugu News