ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దాం: మోదీ

  • జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
  • ఎన్నో మహమ్మారులను భారత్ దీటుగా ఎదుర్కొందని వెల్లడి
  • ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కాపాడుకుంటూ కరోనాపై యుద్ధం కొనసాగిద్దామంటూ పిలుపునిచ్చారు. ఎన్నో మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొన్న భారత్ కరోనాను కూడా దీటుగా ఎదుర్కొంటోందని తెలిపారు. సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పదని అన్నారు.

ఈ విపత్కర సమయంలో భారత్ సామర్థ్యాన్ని తక్కిన ప్రపంచం కూడా నమ్ముతోందని, భారత ఔషధాలు ప్రపంచానికి వరంగా మారుతున్నాయని  తెలిపారు. ప్రపంచానికి భారత్ యోగాను కానుకగా ఇచ్చిందని, నాడు 2000 సంవత్సరంలో వై2కే సమస్య ఉత్పన్నమైతే యావత్ కంప్యూటర్ ప్రపంచం తల్లడిల్లిపోయిన వేళ భారత నిపుణులు నిబ్బరంగా సమస్యను ఎదుర్కొన్నారని, ప్రపంచానికి దిశా నిర్దేశం చేశారని ప్రధాని వెల్లడించారు.

ప్రస్తుతం చాలా కీలక దశలో ఉన్నామని, స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా నివారణ మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి సంక్షోభాన్ని ఎన్నడూ చూడలేదని, అయితే ఈ మహమ్మారిపై పోరాటంలో ఓడిపోవడానికి మనిషి సిద్ధంగా లేడని అన్నారు. కరోనా వైరస్ ఓ సందేశాన్ని తీసుకువచ్చిందని, బతకాలి, బతికించుకుంటూ ముందుకు సాగాలన్నదే ఆ సందేశం అని వెల్లడించారు.


More Telugu News