మహిళా పాత్రికేయురాలిపై చిర్రుబుర్రులాడి మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయిన ట్రంప్

  • కరోనా టెస్టులపై ట్రంప్ ను సూటిగా ప్రశ్నించిన రిపోర్టర్
  • చైనాను కూడా ప్రశ్నించాలన్న ట్రంప్
  • ట్రంప్ కు ప్రశ్నాస్త్రాలు సంధించిన రిపోర్టర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరి ఎలాంటిదో తెలిసిందే. ఇతర దేశాలపై వ్యాఖ్యలు చేయడంలో అయినా, మీడియా సమావేశంలో జవాబులు చెప్పడంలో అయినా ట్రంప్ చాలా ప్రత్యేకం. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో అది మరోసారి రుజువైంది. ఓ మహిళా పాత్రికేయురాలు అడిగిన ప్రశ్నలు ట్రంప్ ను అసహనానికి గురిచేశాయి. దాంతో ఆయన ఆ పాత్రికేయురాలిని కూడా అసహనానికి గురిచేసే ప్రయత్నం చేసి, చివరికి మీడియా సమావేశం నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు.

వైట్ హౌస్ లో ఎప్పట్లాగానే కరోనా పరిస్థితులపై ట్రంప్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీబీఎస్ మీడియా సంస్థ తరఫున వీజా జియాంగ్ అనే మహిళా రిపోర్టర్ హాజరైంది. ఆమె ఓ ఆసియన్ అమెరికన్ మహిళ. ఆమె కూడా ట్రంప్ ను ఓ ప్రశ్న అడిగింది. "కరోనా టెస్టుల విషయానికి వచ్చేసరికి మీరు ఇతర దేశాల కంటే మేమే బెటర్ అంటూ పదేపదే ఎందుకు చెబుతున్నారు? అదేమైనా అంత ముఖ్యమైన విషయంగా భావిస్తున్నారా? లేకపోతే ఇదేమైనా ప్రపంచవ్యాప్త పోటీనా? ప్రతిరోజూ అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కనిపించడంలేదా?" అని ప్రశ్నించింది.

దానికి ట్రంప్ బదులిస్తూ, "ఇక్కడే కాదు ప్రపంచంలో ప్రతి చోటా చనిపోతున్నారు మరి. మీరు నన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? చైనాను కూడా అడగొచ్చు కదా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ప్రస్తావన రావడంతో ఆ మహిళా రిపోర్టర్ నొచ్చుకుంది. ఎందుకంటే ఆమె జన్మతః చైనాకు చెందిన వ్యక్తి. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో స్థిరపడింది. ఈ నేపథ్యంలో, చైనాను ప్రశ్నించవచ్చు కదా అని తనను ట్రంప్ అడగడంలో జాతి వివక్ష ఉందని భావించి అదే విషయాన్ని ట్రంప్ తో చెప్పింది.

"సర్, ఈ మాట నాకే ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నారు?" అంటూ రెట్టించింది. "నిన్నే కాదు, నన్ను చెత్త ప్రశ్నలు అడిగే ప్రతి ఒక్కరికీ ఇదే చెబుతాను" అంటూ ట్రంప్ మరింత దురుసుతనం ప్రదర్శించారు. అంతేకాదు, ఆ మహిళా రిపోర్టర్ ను పట్టించుకోకుండా మరో రిపోర్టర్ వైపు మళ్లారు. అయితే సదరు మహిళా పాత్రికేయురాలు పట్టువదలకుండా ట్రంప్ ను ప్రశ్నిస్తూనే ఉంది. దాంతో విసిగిపోయిన ట్రంప్ చిరాకుపడుతూ మీడియా సమావేశం నుంచి వెళ్లిపోయారు.


More Telugu News