తేరుకుంటున్న కర్నూలు... తొలిసారిగా రోగుల సంఖ్యను దాటేసిన డిశ్చార్జి సంఖ్య!

  • డిశ్చార్జ్ అయిన 281 మంది రోగులు
  • చికిత్స పొందుతున్న 278 మంది
  • సత్ఫలితాలను ఇస్తున్న అధికారుల సమన్వయం
కరోనా మహమ్మారి విజృంభించిన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. కేసులు రావడం మొదలైన తరువాత, తొలిసారిగా, చికిత్స పొందుతున్న వారి సంఖ్య కన్నా, డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య అధికంగా నమోదైంది. తాజాగా శాంతిరామ్ ఆసుపత్రి నుంచి 12 మంది, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య 281కి చేరగా, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 278గా ఉంది.

కాగా, జిల్లాలో కరోనా ప్రభావం కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో అధికంగా ఉంది. కొత్తగా నిన్న ఒక్కరోజే 9 కేసులు రాగా, అన్నీ కర్నూలు నగరంలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ కర్నూలులో 366 మంది వ్యాధి బారిన పడగా, వారిలో సగానికి పైగా డిశ్చార్జ్ అయినట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఇక మొత్తం ఏపీలో నమోదైన కేసుల్లో 25 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతుండటం అధికారుల్లో తీవ్ర ఆందోళన కలిగించగా, ఆపై తీసుకున్న కఠిన నిర్ణయాలు సత్ఫలితాలను అందించే దిశగా సాగాయి. కంటైన్ మెంట్ జోన్ల నిర్వహణ, లాక్ డౌన్ నిబంధనల అమలు తదితరాల్లో అన్ని ప్రభుత్వ వ్యవస్థలూ సమన్వయంతో పనిచేశాయి. దీంతో వైరస్ ఉద్ధృతి కొంతమేరకు నియంత్రణలోకి వచ్చింది.


More Telugu News