1000 కిలోమీటర్ల ప్రయాణం, జేబులో రూ. 10... ఓ వలస కార్మికుని దీన గాధ!

  • గ్రేటర్ నోయిడా నుంచి బీహార్ కు ప్రయాణం
  • 200 కిలోమీటర్లు నడిచిన తరువాత ట్రక్ డ్రైవర్ సాయం
  • అతనికి డబ్బులివ్వగా మిగిలింది రూ. 10 మాత్రమే
  • ఎలాగైనా గమ్యం చేరుతానంటున్న ఓమ్ ప్రకాశ్
లాక్ డౌన్ నిబంధనల కారణంగా వలస కార్మికులు అనుభవిస్తున్నంత బాధ, మరే ఇతర వర్గాల ప్రజలకూ లేదేమో. ఉన్న చోట ఉండలేక, తినేందుకు తిండి, చేసేందుకు పని లేక, స్వస్థలానికి వెళ్లలేక, లక్షలాది మంది నడకబాటను ఎంచుకున్నారు. మార్గమధ్యంలో కొందరు మరణించారు కూడా. బీహార్ లోని సరన్ ప్రాంతానికి చెందిన ఓమ్ ప్రకాశ్ (20) అనే నిర్మాణ రంగ కూలీ, గ్రేటర్ నోయిడాలో పనిచేస్తూ, లాక్ డౌన్ లో చిక్కుకుని పోయాడు. అక్కడే ఉండలేక, కాలినడకన ఇంటికి చేరాలని భావించాడు. ఇప్పుడు అతని స్టోరీ మీడియాకు ఎక్కి వైరల్ అయింది.

దాదాపు 1000 కిలోమీటర్ల ప్రయాణం. కొందరు స్నేహితులతో కలిసి ఓమ్ ప్రకాశ్ బయలుదేరాడు. 200 కిలోమీటర్ల దూరం నడిచి ఆగ్రా వరకూ చేరుకున్న తరువాత, అతన్ని 250 కిలోమీటర్ల దూరంలోని లక్నోకు చేరుస్తానని హామీ ఇచ్చిన ఓ ట్రక్ డ్రైవర్ అందుకు డబ్బులు చెల్లించాలని అడిగాడు. "అతను చార్జీల కింద రూ. 400 అడిగాడు. నేను ఆ మొత్తం ఇచ్చిన తరువాత నా జేబులో కేవలం రూ.. 10 మాత్రమే మిగిలింది. లక్నో నుంచి ఎలా వెళ్లాలన్న ఆందోళన మొదలైంది" అని ఓమ్ ప్రకాశ్ వెల్లడించాడు.

ఆ ట్రక్ కొంతదూరం వెళ్లిన తరువాత, కొందరు పోలీసులు ఆపారు. ట్రక్ ఖాళీగా వెళుతూ ఉండటంతో మరికొందరు వలస కార్మికులను ఎక్కించుకుని, వారిని దగ్గర్లోని రైల్వే స్టేషన్ వద్ద దింపాలని సూచించారు. ఆపై ఎంతో మంది ట్రక్ లో ఎక్కారు. తనలా చాలామంది వందల కిలోమీటర్లు నడిచి వచ్చి, లక్నో టోల్ ప్లాజా వద్ద ఉండిపోయారని, వీరందరూ ట్రక్ డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి జేబులు ఖాళీ చేసుకుని ఇంతవరకూ వచ్చారని, ఇకపై ఎలా వెళ్లాలన్న విషయం ఎవరికీ తెలియదని ఓమ్ ప్రకాశ్ వ్యాఖ్యానించాడు.

"ట్రక్ డ్రైవర్ మహేందర్ కుమార్ నాకు ఆహారం అందించాడు. రోడ్లపై నడుస్తూ వెళుతున్న వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ సంఖ్య వేలల్లోనే ఉంటుంది" అని చెప్పిన ఓమ్ ప్రకాశ్, మిగతా దూరాన్ని తాను ఎలా ప్రయాణిస్తానన్న విషయాన్ని ఆలోచించడం లేదని, తాను మాత్రం వెళుతూనే ఉంటానని ఉబికి వస్తున్న కన్నీటి మధ్య 'ఎన్డీటీవీ' ప్రతినిధితో తన దీన గాథను చెప్పుకున్నాడు. ఇది ఒక్క ఓమ్ ప్రకాశ్ బాధ మాత్రమే కాదు. ఇటువంటి వాళ్లు దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉన్నారనడంలో సందేహం లేదు.


More Telugu News