ఇకమీదట ఉప్పు దొరకదంటూ కొత్త పుకారు.. దుకాణాలకు పోటెత్తిన జనం!

  • ఛత్తీస్ గఢ్ లో పుట్టిన పుకారు
  • పనులు మానేసుకుని షాపుల ముందు ప్రజల క్యూ
  • ఉప్పు నిల్వలు సరిపడా ఉన్నాయన్న అధికారులు
ఛత్తీస్ గఢ్ లో ఓ పుకారు రాష్ట్రమంతా పాకి, ప్రజలను నిత్యావసర దుకాణాలవైపు పరుగులు పెట్టేలా చేసింది. మరో రెండు నెలల పాటు ఉప్పు లభించే అవకాశాలు లేవని, ఇప్పుడే కొనుగోలు చేసి, దాచుకోవాలన్న ప్రచారం, ఆ నోటా, ఈ నోటా పాకుతూ, అన్ని జిల్లాల్లోనూ వ్యాపించగా, ప్రజలు తమ పనులు మానుకుని, భారీ ఎత్తున ఉప్పు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు. వ్యాపారులు ధరలు పెంచినా, బస్తాల కొద్దీ కొనుక్కెళ్లారు.

విషయం తెలుసుకున్న అధికారులు, మార్కెట్లో తగినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రాయ్ పూర్ కలెక్టర్ స్వయంగా ఇచ్చిన ఆదేశాలతో ఉప్పు డీలర్లపై అధికారులు విచారణ ప్రారంభించారు. అధిక ధరలకు ఉప్పును విక్రయిస్తున్న దుకాణాలను సీజ్ చేశారు.

ఉప్పు విక్రయదారులపై నిఘా పెట్టామని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని దాదాపు 56 లక్షల మంది రేషన్ కార్డు దారులకు సబ్సిడీ ధరపైనే ఉప్పును అందిస్తున్నామని, బహిరంగ మార్కెట్లోకి నెలలో 8 నుంచి 10 వేల టన్నుల ఉప్పు వస్తోందని స్పష్టం చేశారు. ఇటువంటి వదంతులను ప్రజలు నమ్మరాదని కోరారు.


More Telugu News