కాగజ్‌నగర్‌ పరిశ్రమలో గ్యాస్‌ లీక్.. కార్మికుడికి అస్వస్థత!

  • ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో ఘటన
  • ఈ రోజు తెల్లవారు జామునే గ్యాస్ లీక్
  • నాగుల రాజం అనే కార్మికుడికి అస్వస్థత
  • ఆసుపత్రికి వెళ్లడంతో గ్యాస్ లీక్‌ ఘటన వెలుగులోకి
కుమరం భీమ్ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో కలకలం చెలరేగింది. అక్కడి ఎస్‌పీఎం కాగితపు పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ అయింది. అయితే, ఈ ఘటన బయటకు రాకుండా ఆ పరిశ్రమ యాజమాన్యం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. అయినప్పటికీ ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ రోజు తెల్లవారు జామునే ఈ ఘటన జరిగినప్పటికీ ఆ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రాకుండా చూసుకుంది. గ్యాస్‌ లీక్‌ ఘటనలో నాగుల రాజం అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు.. దీంతో అలాగే ఇంటికి వెళ్లిపోయాడు.. ఆ తర్వాత ఇంట్లో ఆయన పరిస్థితి మరింత దిగజారడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

దీంతో వైద్యులు ఆయనను ప్రశ్నించడంతో ఆ విషయం బయటపడింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కాగితపు పరిశ్రమలో సుమారు 20 మంది కార్మికులు ఉన్నట్లు తెలిసింది. విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ ఘటన మరవకముందే ఇటువంటి ఘటనలే పలు చోట్ల వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.


More Telugu News