భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తత.. సరిహద్దుల్లో గొడవపడ్డ ఇరు దేశాల సైనికులు

  • ఉత్తర సిక్కింలో ఘటన
  • చైనా సైనికులతో గొడవపడ్డ 20 మంది భారత జవాన్లు
  • ఇరు దేశాల అధికారుల మధ్య చర్చ
  • సద్దుమణిగిన పరిస్థితులు
భారత్‌, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర సిక్కిం సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు గొడవపడ్డారు. సుమారు 20 మంది భారత జవాన్లు చైనా సైనికులతో ఆయుధాలు వాడకుండా ఘర్షణ పడ్డారు. దాదాపు 16,000 అడుగుల ఎత్తులో నియంత్రణ రేఖ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.

ఇరు దేశాల సైనికుల మధ్య రాళ్లదాడి కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక్కడి నియంత్రణ రేఖపై భారత్‌, చైనాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో నిక్షిప్తమయ్యాయి.

ఈ ఘటన నేపథ్యంలో ఇరు దేశాల అధికారుల మధ్య చర్చలు జరిగాయని, పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిసింది. ఇరు దేశాల సైనికుల మధ్య కొద్ది సేపు మాత్రమే ఈ ఘర్షణ జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు.

2017లోనూ లద్ధాఖ్ సమీపంలో ఇరు దేశాల మధ్య ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. డోక్లాంలో గతంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. 73 రోజుల పాటు ప్రతిష్టంభన అనంతరం చైనా సైనికులు వెనుదిరిగి వెళ్లిపోయారు. కరోనా విజృంభణ నేపథ్యంలో మరోసారి ఇటువంటి ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకోవడం గమనార్హం.


More Telugu News