కుమార్తె చదువు కోసం రూ. 5 లక్షల పొదుపు.. ఆ సొమ్ముతో 600 కుటుంబాల ఆకలి తీర్చిన సెలూన్ యజమాని!

  • తమిళనాడులోని మధురైలో ఘటన
  • తనకు సంపాదించే అవకాశం ఇంకా ఉందన్న వైనం
  • మరో 400 కుటుంబాల కోసం భార్య మెడలోని ఆభరణాలను తాకట్టు పెడతానన్న మోహన్
కుమార్తె చదువు కోసం 5 లక్షలు పొదుపు చేసిన ఓ సెలూన్ యజమాని ఆ సొమ్మును పేదల ఆకలి తీర్చేందుకు ఉపయోగించాడు. తమిళనాడులోని మధురైలో జరిగిందీ ఘటన. మేలమడైకి చెందిన మోహన్ (47) సెలూన్ నిర్వహిస్తుంటాడు. లాక్‌డౌన్ కారణంగా పేదలు పడుతున్న ఇబ్బందులతో మనసు కరిగిపోయిన మోహన్.. కుమార్తె చదువు కోసం దాచిన ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసిన వారికి సాయం అందించాలని నిర్ణయించాడు.

ఇందులో భాగంగా 5 కిలోల బియ్యం, కూరగాయలు, కిరాణ, వంట నూనెతో కూడిన కిట్‌ను తయారుచేసి 615 కుటుంబాలకు అందించి గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ పేదల కష్టాలు తనను కలచివేశాయని, తన కుమార్తె భవిష్యత్తు కోసం డబ్బులు ఆదా చేసేందుకు ఇంకా చాలా సమయం ఉందని అన్నాడు.

అందుకనే బ్యాంకులో దాచిన మొత్తాన్ని డ్రా చేసి పేదలకు రేషన్ సరుకులు అందించినట్టు తెలిపాడు. ఇంకా 400 కుటుంబాలకు సాయం చేయాల్సి ఉందని, తన భార్య ఆభరణాలను కానీ, తన ప్లాట్‌ను కానీ తాకట్టు పెట్టి వారికి సాయం చేస్తానని చెప్పుకొచ్చాడు. తనకింకా చాలా భవిష్యత్ ఉందని, తర్వాత సంపాదించుకోగలుగుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.


More Telugu News