కరోనా సోకి ప్లాస్మా థెరపీతో బయటపడ్డ డాక్టర్... గుండెపోటుతో మృతి!

  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • గత 14 రోజులుగా వెంటిలేటర్ పై డాక్టర్
  • కరోనా నెగటివ్ వచ్చినా, ప్రాణం తీసిన హార్ట్ ఎటాక్
కరోనా పాజిటివ్ సోకి, తొలిసారిగా ప్లాస్మా థెరపీ చికిత్స చేయించుకున్న ఉత్తర ప్రదేశ్ వైద్యుడు (58) శనివారం నాడు కన్నుమూశారు. ఆయన గుండెపోటు కారణంగా మృతి చెందారని, శనివారం నాటి పరీక్షల్లో ఆయన కరోనా నెగటివ్ గా తేలారని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ వైద్యులు పేర్కొన్నారు.

ఓరై ప్రాంతానికి చెందిన ఈ వైద్యుడు, కేజీఎంయూలో చికిత్స చేయించుకున్నారని, ఇండియాలో ప్లాస్మా థెరపీ చికిత్స చేయించుకున్న తొలి వ్యక్తి ఈయనేనని తెలిపారు. ప్లాస్మా థెరపీ తరువాత, దురదృష్టవశాత్తూ యూరిన్ ఇన్ఫెక్షన్ సోకిందని, డయాలసిస్ కూడా ప్రారంభించామని, ఈలోగా గుండెపోటుతో ఆయన మరణించారని, కరోనా నుంచి కోలుకున్న తరువాత మరణం సంభవించిందని వెల్లడించారు. ఆయన భార్య వ్యాధి నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు.

కాగా, గడచిన 14 రోజులుగా ఈ డాక్టర్ వెంటిలేటర్ పైనే ఉన్నారని కేజీఎంయూ వైస్ చాన్స్ లర్ ఎంఎల్బీ భట్ మీడియాకు వెల్లడించారు. ఆయనకు రక్తపోటు ఉందని, డయాబెటీస్ తోనూ బాధపడుతున్నారని చెప్పారు. గుండెపోటు రాగానే, ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమించారని, అయినా ఫలితం లేకపోయిందని తెలియజేశారు.


More Telugu News