కరోనా వాక్సిన్ కోసం భారత్ బయోటెక్ తో ఐసీఎంఆర్ భాగస్వామ్యం!
- మేకిన్ ఇండియాలో భాగంగా డీల్
- ఇప్పటికే భారత్ బయోటెక్ కు చేరిన ఐసొలేటెడ్ వైరస్
- ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన ఐసీఎంఆర్
కరోనా వాక్సిన్ తయారీ దిశగా, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్)తో కేంద్ర ప్రభుత్వ ఐసీఎంఆర్ (ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇండియాలోనే వాక్సిన్ ను తయారు చేయడమే లక్ష్యంగా ఇరు కంపెనీలూ కలిసి పని చేస్తాయని శనివారం రాత్రి ఐసీఎంఆర్, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ వాక్సిన్ ను తయారు చేస్తామని పేర్కొంది. ఐసీఎంఆర్ అధీనంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో ఐసొలేట్ చేయబడిన కరోనా వైరస్ ను అభివృద్ధి చేశామని, దాన్ని భారత్ బయోటెక్ కు సురక్షితంగా చేర్చామని, దాని సాయంతో వాక్సిన్ ను అభివృద్ధి చేస్తామని తెలియజేసింది.