నేడు కువైట్ నుంచి హైదరాబాద్‌కు తొలి విమానం

  • అమెరికా నుంచి రావాల్సిన తొలి విమానం రద్దు
  • విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్ కేంద్రాలకు 
  • హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ప్యాకేజీ
లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం  ‘వందేభారత్ మిషన్’ను చేపట్టింది. ఈ మిషన్ తొలి దశలో భాగంగా 64 విమానాలను సిద్ధం చేసింది. కాగా, భారతీయులతో కూడిన తొలి విమానం నేడు కువైట్ నుంచి హైదరాబాద్ రానుంది. నిజానికి తొలి విమానం అమెరికా నుంచి రావాల్సి ఉండగా అది రద్దయింది. ఇక, విదేశాల నుంచి రాష్ట్రంలో అడుగుపెట్టే వారిని నేరుగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ. 5 వేల నుంచి రూ. 30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.

మరోవైపు, విదేశాల నుంచి వచ్చే వారి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరు కమిటీలను నియమించింది. అలాగే, విమానాశ్రయంలో ఉండేందుకు అన్ని విభాగాల నుంచి 11 మంది అధికారుల చొప్పున మరో రెండు బృందాలను నియమించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల ద్వారా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు. ఇందుకోసం 20 బస్సులను అధికారులు సిద్ధం చేశారు.


More Telugu News