పాక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అరెస్ట్

  • ఆయుధాల స్మగ్లర్ బిల్లా, అతడి అనుచరుల అరెస్ట్
  • ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, ఖలిస్థాన్ జిందాబాద్ ఫ్రంట్ అధినేతలతో  సంబంధాలు
  • అత్యాధునిక మారణాయుధాలు స్వాధీనం
పాక్ ఉగ్రవాదులతో సంబంధాలున్న ఆయుధాల స్మగ్లర్ బల్జీందర్ సింగ్‌ అలియాస్ బిల్లా మండియాలాను చండీగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ముఠాలోని మరో ఆరుగురిని కూడా కటకటాల వెనక్కి పంపారు. వీరి నుంచి పెద్ద ఎత్తున అత్యాధునిక మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన బిల్లా పాకిస్థాన్ నుంచి అత్యాధునిక విదేశీ మారణాయుధాలను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి విక్రయిస్తుంటాడు. అంతేకాదు, ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, ఖలిస్థాన్ జిందాబాద్ ఫ్రంట్ అధినేతలతోనూ అతడికి సంబంధాలున్నట్టు పోలీసులు తెలిపారు.

హత్యలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి అతడిపై ఇప్పటి వరకు 18 క్రిమినల్ కేసులు నమోదైనట్టు చెప్పారు. కపుర్తలా జిల్లాలోని సుల్తాన్‌పూర్ లోడి ప్రాంతంలో బిల్లా, అతడి అనుచరులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న మారణాయుధాల్లో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు ఉపయోగించే జర్మన్ మేడ్ ఎస్ఐజీ సౌవెర్ పిస్టళ్లు, రెండు డ్రమ్ మెషీన్ గన్లు ఉన్నాయని, అలాగే, 3 లక్షలకు పైగా ఆస్ట్రేలియన్ డాలర్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. తనకు జర్మనీ, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్టు బిల్లా అంగీకరించాడని పోలీసులు తెలిపారు.


More Telugu News