అప్పుడు న్యూజిలాండ్ ఆటగాళ్లు స్విమ్మింగ్ పూల్ వద్ద విలపిస్తూ కనిపించారు: నాటి ఘటనను గుర్తుచేసుకున్న ఇంజమామ్

  • 2002లో పాక్ లో ఉగ్రదాడి
  • భయకంపితులైన న్యూజిలాండ్ క్రికెటర్లు
  • పర్యటన మధ్యలోనే ముగించుకుని స్వదేశం పయనం
పాకిస్థాన్ లో ఉగ్రదాడుల భయంతో అక్కడ పర్యటించాలంటే అనేక దేశాల క్రికెట్ జట్లు హడలిపోతుంటాయి. 2009లో శ్రీలంక ఆటగాళ్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అక్కడి నుంచి మరే విదేశీ జట్టు కూడా పాకిస్థాన్ లో పర్యటన అంటే ససేమిరా అనే పరిస్థితి వచ్చింది. అంతకుముందు 2002లో కూడా పాక్ లో ఉగ్రదాడి జరిగింది. ఆనాటి సంఘటనలను మాజీ ఆటగాడు ఇంజమామ్ ఉల్ హక్ వివరించాడు. లాహోర్ లో ని గడాఫీ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో తాను ట్రిపుల్ సెంచరీ చేశానని, బౌలింగ్ లో షోయబ్ అక్తర్ విజృంభించడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైందని తెలిపాడు.

రెండో టెస్టు కరాచీలో జరగాల్సి ఉండగా, ఉదయం పూట హోటల్ లో భారీ బాంబు పేలుడు జరిగిందని ఇంజమామ్ చెప్పాడు. ఆ సమయంలో తాను ప్రాక్టీసుకు వెళ్లడంతో బతికిపోయానని, తాను బస చేసిన గది కూడా పాక్షికంగా ధ్వంసమైందని తెలిపాడు. ప్రాక్టీసు ముగించుకుని స్టేడియం నుంచి హోటల్ కు వెళ్లిన తనను వెంటనే కింది ఫ్లోర్ కు వెళ్లాలని సూచించారని, తాను స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లేసరికి అక్కడ న్యూజిలాండ్ ఆటగాళ్లు విలపిస్తూ కనిపించారని వెల్లడించాడు.

వారు ఎప్పుడూ ఇలాంటి భయంకర అనుభవాన్ని చవిచూసి ఉండరని, బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లిన ఆటగాళ్లు బాంబు భయంతో వణికిపోయారని నాటి సంగతులను ఇంజమామ్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అంతేకాదు, ఆ సిరీస్ ను మధ్యలోనే ముగించుకుని కివీస్ జట్టు స్వదేశం వెళ్లిపోయిందని తెలిపాడు. కాగా, నాడు జరిగింది ఆత్మాహుతి దాడి కాగా, ఆ దాడిలో 11 మంది ఫ్రెంచ్ ఇంజినీర్లు, ఇద్దరు పాకిస్థాన్ పౌరులు సహా ఆత్మాహుతి దళ సభ్యుడు కూడా మరణించాడు.


More Telugu News