బాబ్రీ మసీదు కూల్చివేత కేసు.. తీర్పుకు కొత్త డెడ్ లైన్ విధించిన సుప్రీంకోర్టు!

  • తీర్పుకు మూడు నెలల సమయాన్ని పొడిగించిన సుప్రీం
  • ఆగస్ట్ 31 వరకు లక్నోలోని సీబీఐ కోర్టుకు గడువు
  • కేసులో కీలక నిందితులుగా బీజేపీ సీనియర్ నేతలు
దేశాన్ని కుదిపేసిన 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పును వెలువరించేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయాన్ని పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఆగస్ట్ 31వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తూ జస్టిస్ నారీమన్, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేసును విచారిస్తున్న న్యాయమూర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాలని తెలిపింది.

ఈ కేసులో బీజేపీ కీలక నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి తదితరులు ఉన్నారు. మసీదు కూల్చివేతకు సంబంధించి అయోధ్యలో రెండు కేసులు నమోదయ్యాయి. మసీదును కూల్చడంలో కుట్ర కోణం దాగుందనేది ఒక కేసు కాగా... మసీదును కూల్చాలంటూ జనాలను రెచ్చగొట్టారనేది రెండో కేసు. వీటితో పాటు మరో 47 కేసులు నమోదు కాగా... వాటన్నింటినీ కూల్చివేత కేసుతోనే జత చేశారు.

రెండు కేసులకు సంబంధించి వేర్వేరుగా విచారణ చేయడం జరిగింది. లక్నోలో కూల్చివేతపై విచారణ జరగగా... ప్రజలను రెచ్చగొట్టిన కేసు విచారణ రాయబరేలి కోర్టులో జరుగుతోంది.


More Telugu News