అవగాహన లేకుండా మీడియా ముందుకు రావడం ఆయన నైజం: రాహుల్ పై బీజేపీ ఫైర్

  • లాక్ డౌన్ కొనసాగింపుపై రాహుల్ విమర్శలు
  • కేంద్రం పారదర్శకతతో వ్యవహరిస్తోందన్న బీజేపీ నేత సుధాంషు
  • వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడతారని విమర్శ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బీజేపీ మరోసారి టార్గెట్ చేసింది. ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడటం రాహుల్ నైజమని మండిపడింది. లాక్ డౌన్ ఎత్తేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో వ్యవహరించాలంటూ రాహుల్ విమర్శించారు. ఏ ప్రమాణాలు, సూత్రాల ఆధారంగా లాక్ డౌన్ ఎత్తేస్తారో ఆలోచించాలని చెప్పారు. పూర్తి స్పష్టతతో ప్రజల ముందుకు రావాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి సహాయ, సహకారాలు లేకుండా లాక్ డౌన్ ను కొనసాగించడం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత సుధాంషు త్రివేది కౌంటర్ ఇచ్చారు.

కరోనాపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తోందని త్రివేది అన్నారు. అన్ని రాష్ట్రాలను, జిల్లాల మేజిస్ట్రేట్ (కలెక్టర్) లను కూడా ప్రధాని మోదీ పరిగణనలోకి తీసుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రుల మీద, జిల్లా మేజిస్ట్రేట్ ల మీద ప్రధాని విశ్వాసం ఉంచుతున్నారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అవగాహన లేకుండా మాట్లాడటం రాహుల్ నైజమని ధ్వజమెత్తారు.


More Telugu News