నిన్న రాత్రి బ్లాస్టింగ్‌ జరిగిందని కొందరు వదంతులు సృష్టించారు.. అలాంటిదేమీ లేదు: ఏపీ మంత్రులు

  • నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది
  • పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నారు
  • ఇవాళ మంత్రుల బృందం భేటీ
విశాఖ నగరంలో నిన్న రాత్రి గ్యాస్ లీకేజీ మరోసారి జరిగిందని ప్రచారం జరిగింది. ఎల్జీ పాలిమర్స్ నుంచి మరోసారి గ్యాస్ లీకవుతున్నట్లు సమాచారం రావడంతో స్థానికులు రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలవైపు పరుగులు తీశారు. ఈ విషయంపై ఏపీ మంత్రులు స్పందించి స్పష్టతనిచ్చారు.

'నిన్న రాత్రి బ్లాస్టింగ్‌ జరిగిందని కొందరు సోషల్‌ మీడియాలో వదంతులు సృష్టించారు, అలాంటి పరిస్థితులేమి లేవు. నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పనిచేస్తున్నారు. ఇవాళ మంత్రుల బృందం భేటీ అయ్యి, 3 అంశాలపై చర్చించబోతుంది' అని ఏపీ మంత్రి కన్నబాబు వివరించారు.

'సీఎం జగన్‌ గారి ఆదేశాల మేరకు పరిశ్రమల్లో భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నాం. ప్రజలు పూర్తిగా భద్రతలో ఉన్నామన్న భావన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. ఫ్యాక్టరీ తెరవాలా? వద్దా? అన్నది నిపుణుల అధ్యయనంలో వెల్లడవుతుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు' అని కన్నబాబు చెప్పారు.

ఇదే విషయంపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ... 'ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురికావద్దు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాం. బాధిత గ్రామాల ప్రజల కోసం షెల్టర్స్‌ ఏర్పాటు చేశాం. ఎవరూ ఇబ్బంది పడకుండా మంచి భోజనం అందేలా ఏర్పాట్లు చేశాం, వసతి సదుపాయాలు కల్పించాం' అని చెప్పారు.
 
'ఎల్జీ పాలిమర్స్‌లో బ్లాస్ట్‌ అయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు, పరిస్థితి అంతా అదుపులోనే ఉంది. గుజరాత్‌, నాగపూర్‌ నుంచి వచ్చిన నిపుణులు, నెమ్మదిగా విష వాయువులను కంట్రోల్‌ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం, లేదా రేపటి లోగా పూర్తిగా అదుపులోకి వస్తుంది' అని వివరించారు.


More Telugu News