విశాఖ దుర్ఘటన ఎఫెక్ట్.. 9 శ్రామిక్ రైళ్ల రాకపోకలకు అంతరాయం
- సింహాచలం మీదుగా వెళ్లాల్సిన రైళ్లను ఆపివేసిన అధికారులు
- తీవ్ర అస్వస్థతకు లోనైన స్టేషన్ సిబ్బంది
- 12 గంటల వరకు నిలిచిపోయిన రైళ్లు
విశాఖపట్టణంలో నిన్న జరిగిన ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన కారణంగా వలస కార్మికులతో వెళ్లాల్సిన 9 శ్రామిక్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటన సంభవించిన ఎల్‌జీ పాలిమర్స్‌కు సమీపంలోనే సింహాచలం రైల్వే స్టేషన్ ఉంది. విషవాయువుల లీకేజీ కారణంగా స్టేషన్‌లోని సిబ్బంది కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్ల మంటలు, వికారం వంటి సమస్యలతో బాధపడ్డారు. దీంతో సింహాచలం స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన శ్రామిక్ రైళ్లను పరిస్థితి కుదుటపడే వరకు నిలిపివేశారు. ఫలితంగా ఉదయం 8:35 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన 9 రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.