అమ్మాయిని ఎరగా చూపి... డబ్బు నొక్కేసిన సైబర్ నేరగాళ్లు!

అమ్మాయిని ఎరగా చూపి... డబ్బు నొక్కేసిన సైబర్ నేరగాళ్లు!
  • లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచే పని
  • నెట్లో కనిపించిన నంబర్ ను సంప్రదిస్తే మోసం
  • రూ. 80 వేలు చెల్లించిన ఐటీ ఉద్యోగి
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వలపు వల వేసిన సైబర్ నేరగాళ్లు, అతడి నుంచి డబ్బు కాజేశారు. హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, లాక్ డౌన్ కారణంగా ఇంట్లో నుంచి పని చేస్తున్న ఓ అవివాహితుడు, ఖాళీ సమయంలో వెబ్ సైట్ లో వీడియోలు చూస్తుండగా, . అమ్మాయిలతో చాటింగ్, వీడియో కాలింగ్ కోసం సంప్రదించాలంటూ ఓ ఫోన్ నంబర్ కనిపించింది. దానికి కాల్ చేయగా, ఓ యువతి మాట్లాడింది. ఆమె విసిరిన వలపు వలకు ఫిదా అయిన యువకుడు, ఫోటోలు పంపించాలని కోరాడు. ఆమెకు డబ్బు పంపించాడు కూడా.

ఆపై వీడియో కాలింగ్ ద్వారానూ వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో కాల్స్ ను క్యాప్చర్ చేసిన కేటుగాళ్లు, ఆపై అతన్ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో, రూ. 80 వేల వరకూ సమర్పించుకున్నాడు. ఆ తరువాత కూడా వేధింపులు ఆగలేదు. బాధితుడు స్పందించక పోవడంతో ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాఫ్తు ప్రారంభించారు.


More Telugu News