విశాఖ దుర్ఘటనపై స్పందించిన క్రీడాకారులు

  • తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: కోహ్లీ
  • దురదృష్టకర ఘటన: సానియా మీర్జా
  • ఆ దృశ్యాలు నన్ను కలచివేశాయి: సునీల్ ఛెత్రీ
విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటనపై పలువురు భారత క్రీడాకారులు స్పందించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గ్యాస్ లీక్ ఘటనలో తమ ప్రియమైన వారి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా విశాఖ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. గ్యాస్ లీక్  ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ట్వీట్‌లో పేర్కొంది.

భారత ఫుట్‌బాల్ జట్టు సారథి సునీల్ ఛెత్రీ విశాఖ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు తనను తీరని మనోవేదనకు గురిచేశాయన్నాడు. ఆసుపత్రి పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. ఇలా జరగడం దురదృష్టకరమని, బాధితులు త్వరగా కోలుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, ఓపెనర్ శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, షట్లర్ సైనా నెహ్వాల్ తదితరులు ఆకాంక్షించారు.


More Telugu News