వాతావరణ హెచ్చరికలపైనా ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారి!

  • ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ
  • విమాన సర్వీసులు నిలిపివేసిన దేశాలు
  • వాతావరణ పరిశోధనలో విమానాలు సేకరించే డేటాకు ప్రాముఖ్యత
  • ప్రపంచవ్యాప్తంగా వాతావరణ డేటా కొరత
  • అంతర్జాతీయ వాతావరణ సంస్థల అంచనాల్లో తీవ్ర వైరుధ్యాలు
కిందటి వారంలో అండమాన్ సముద్రంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. యూరప్ కు చెందిన ఓ ప్రముఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం ఆ అల్పపీడనం తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది. ఇతర వాతావరణ సంస్థలు మాత్రం ఆ అల్పపీడనం బలహీనపడుతుందని పేర్కొన్నాయి. ఆయా వాతావరణ సంస్థల అంచనాల మధ్య ఇంతలా వైరుధ్యం కనిపించడానికి కారణం కరోనా వైరస్ అంటే ఆశ్చర్యం కలగకమానదు.

వాతావరణంలో మార్పులపై అంచనా వేసేందుకు ఆయా సంస్థలు ప్రధానంగా విమానాలు, బెలూన్లపై ఆధారపడతాయి. శాటిలైట్ల నుంచి కూడా డేటా లభించే అవకాశం ఉన్నా, విమానాలు, బెలూన్లు వాటికంటే తక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి కచ్చితమైన సమాచారం సేకరిస్తాయి. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక దేశాలు విమాన సర్వీసులు నిలిపివేశాయి. వాతావరణ పరిశోధనలకు సంబంధించిన విమానాలు కూడా ఎయిర్ పోర్టులకే పరిమితమయ్యాయి. దాంతో వాతావరణ సంస్థలకు అందే డేటా అరకొరగానే ఉంటోంది.

దీనిపై భారత కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ మాట్లాడుతూ, విమానాల నిలిపివేత కారణంగా వాతావరణ సమాచారంలో 60 శాతం లోటు ఏర్పడిందని, ఈ కారణంగానే వాతావరణ హెచ్చరికల్లో కచ్చితత్వం తగ్గుతోందని వివరించారు. భారత ప్రభుత్వ వాతావరణ సంస్థ ఐఎండీ కూడా రుతుపవనాల సీజన్ కోసం తన బెలూన్లను అట్టిపెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఐఎండీ బెలూన్లు గాల్లోకి ఎగరలేదు.

భారత్ కు నైరుతి రుతుపవనాల సీజన్ అత్యంత ముఖ్యమైనది కావడంతో వాటిని ఇప్పుడే వినియోగిస్తే భవిష్యత్ అవసరాలకు కష్టమవుతుందన్నది ఐఎండీ భావన. ఎందుకంటే, వాతావరణ పరిశోధన, పర్యవేక్షణకు ఉపయోగించే బెలూన్లను భారత్ ప్రధానంగా దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఆయా దేశాల నుంచి బెలూన్ల దిగుమతి సాధ్యం కాకపోవచ్చు. ఈ కారణంగానే తగినంత డేటా లభ్యం కావడంలేదని, దాంతో వాతావరణ హెచ్చరికల్లో కచ్చితత్వం లోపిస్తోందని రాజీవన్ అభిప్రాయపడ్డారు.


More Telugu News