వైజాగ్ గ్యాస్ లీక్ వార్తపై స్పందించిన ఎన్టీఆర్, రామ్ చరణ్

  • ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి గ్యాస్ లీక్
  • ఎనిమిదిమంది మృతి
  • బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ప్రగాఢ సానుభూతి
  • దృశ్యాలు చూస్తుంటే గుండె పగిలిందన్న రామ్ చరణ్
వైజాగ్ లోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ కర్మాగారం నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకై ఎనిమిదిమంది మరణించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజానీకాన్ని ఈ గ్యాస్ లీక్ ఘటన అతలాకుతలం చేసింది. ఆర్ఆర్ వెంకటాపురం ప్రాంతంలో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.

దీనిపై టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. వైజాగ్ గ్యాస్ లీక్ వార్త తనను  తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో వైజాగ్ నగర ప్రజలు మరింద దృఢంగా నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు.

అటు, రామ్ చరణ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైజాగ్ లో దృశ్యాలు చూస్తుంటే గుండె పగిలినంత పనైందని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాల పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విపత్కర సమయంలో వైజాగ్ ప్రజలకు మద్దతు పలుకుతున్నానని ట్వీట్ చేశారు.


More Telugu News