వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక.. మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

  • 1957-62 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన నర్సయ్య
  • సుతారి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆనందం
  • పరిస్థితి విషమించి ఇంటిలోనే కన్నుమూసిన వైనం
ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే చాలు తరతరాలకు తరగనంత ఆస్తిని సంపాదిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు అనారోగ్యంతో మంచానపడి వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ప్రాణాలు విడిచాడు. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన కర్రెళ్ల నర్సయ్య స్వాతంత్ర్య సమర యోధుడు. 1957-62 మధ్య అప్పటి నేరెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా పనిచేశారు.

ప్రజాప్రతినిధిగా ఉన్నన్నాళ్లు ప్రజా సేవకే అంకితమైన నర్సయ్య నిజాయతీగా బతికారు. తనకంటూ ఏమీ సంపాదించుకోలేదు. 15 ఏళ్ల క్రితం ఆయన మరణించారు. ఆయన కుమారుడు ఆనందం (48) గ్రామంలో సుతారి పనిచేస్తూ కుటుంబాన్ని లాక్కొస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందం వైద్యులకు చూపించుకోగా, కడుపులో కణతులు ఉన్నాయని, ఆపరేషన్‌కు రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు.

మళ్లీ వైద్యం చేయించుకునేందుకు లక్ష రూపాయలు అవసరం కావడంతో అంత డబ్బు తీసుకొచ్చే మార్గం కనిపించక చేయించుకోలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో నిన్న ఇంట్లోనే ఆయన ప్రాణాలు విడిచాడు. ఆనందానికి భార్య అనిత, ఇద్దరు కుమారులు లెనిన్, మధు ఉన్నారు.


More Telugu News