ఎస్ఈసీ లేఖపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది.. నిమ్మగడ్డ రమేశ్ వెర్షన్ ను కూడా తెలుసుకోవాల్సి ఉంది: ఏపీ సీఐడీ చీఫ్

  • రమేశ్ కుమార్ పంపిన లేఖ ఆఫీసులో తయారు కాలేదు
  • అడిగిన ప్రశ్నలకు ఆయన పీఎస్ సరిగా సమాధానాలు చెప్పలేకపోయారు
  • రమేశ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు
కేంద్ర హోం శాఖకు ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంపిన లేఖ ఆయన కార్యాలయంలో రాసినది కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్  కుమార్ చెప్పారు. ఈ లేఖను ఎక్కడ తయారు చేశారనే కోణంలో తాము రమేశ్ కుమార్ పర్సనల్ సెక్రటరీ సాంబమూర్తిని విచారించామని తెలిపారు.

ఎస్ఈసీ రమేశ్ కుమార్ డిక్టేట్ చేస్తుంటే తాను డెల్ ల్యాప్ టాప్ లో టైప్ చేశానని ఆయన చెప్పారని... ఆ తర్వాత దాన్ని స్కాన్ చేశాను, సంతకం తీసుకున్నాను, వాట్సాప్ పంపించాను అంటూ ఆయన ఒక కథనాన్ని చెప్పారని అన్నారు. ఇదే సమయంలో తాము అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పలేకపోయారని తెలిపారు. ఆ ఫైల్ ఎక్కడుందని అడిగితే డిలీట్  చేశానని చెప్పారని... ఎందుకు డిలీట్ చేశారని అడిగితే సమాధానం చెప్పలేకపోయారని అన్నారు.

కాన్ఫిడెన్షియల్ లెటర్ కదా అని అనుకున్నప్పటికీ... హార్డ్ డిస్క్ మొత్తాన్ని ఫార్మాట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తే దానికి కూడా సమాధానం లేదని అన్నారు. ఆ లెటర్ ఆఫీసులో తయారు కాలేదు, బయట తయారయిందనేదే అసలైన అభియోగమని... ఆ లేఖ అక్కడే తయారైనట్టు తేలి ఉంటే అంతటితో విచారణ ముగిసేదని చెప్పారు. అక్కడ తయారు కాలేదనే కోణంలోనే విచారణను ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. నిమ్మగడ్డ రమేశ్ ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని... అయితే ఆయన వెర్షన్ ఏమిటో కూడా తెలుసుకోవాలని, విచారణలో ఇదొక భాగమని చెప్పారు.


More Telugu News