విజయ్ దేవరకొండకు మద్దతు ప్రకటించిన 'మా' 

  • విజయ్ పై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు
  • ఇకపై తప్పుడు వార్తలు రాస్తే సహించం
  • తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది
కొన్ని వెబ్ సైట్లు తనపై తప్పుడు వార్తలు రాస్తూ, తన కెరీర్ ను నాశనం చేస్తున్నాయంటూ హీరో విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, విజయ్ కు చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అండగా నిలబడుతున్నారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా తన మద్దతును ప్రకటించింది.

'మా' యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఛారిటీని పెట్టి పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారని చెప్పారు. సీసీసీకి కూడా విరాళం ఇచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనుకుంటున్న విజయ్ పై బురదచల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటివారిని తాను నిలదీస్తున్నానని... అసలు మీరంతా ఎవరని ఆయన ప్రశ్నించారు.

కొన్ని వెబ్ సైట్లు రాస్తున్న అసత్య వార్తలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని బెనర్జీ చెప్పారు. ఇకపై తప్పుడు వార్తలు రాస్తే సహించబోమని హెచ్చరించారు. విజయ్ దేవరకొండకు అసోసియేషన్ మద్దతుగా ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీలో అందరూ అన్నదమ్ములమేనని అన్నారు. సినీ పరిశ్రమకు మీడియా సపోర్ట్ ఉండాలని... అంత మాత్రాన తప్పుడు వార్తలు రాస్తామంటే కుదరదని చెప్పారు. విజయ్ కి జరిగినట్టు భవిష్యత్తులో మరెవరికైనా జరిగితే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


More Telugu News