మీ నాయకులను ఆ మందు తాగమనండి.. అర్థమైపోతుంది!: జగన్ కు సోమిరెడ్డి సూచన

  • ఆ ‘క్యూ’ లను చూస్తే పేదోళ్లా? ధనవంతులా? అర్థమౌతుంది
  • నాణ్యత లేని మద్యం ధరలు పెంచడం ఘోరం
  • మద్యం ధరలు పెంచితే పేదోడు తాగడనేది కరెక్టు కాదు
ఏపీలో మద్యం దుకాణాల ముందు బారులు తీరింది పేదోళ్లా? ధనవంతులా? అనేది ఆ ‘క్యూ’ లను చూస్తే తెలుస్తుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కూలీనాలీ చేసుకునే వాళ్లే  ఆ ‘క్యూ’ లలో ఉన్నారని, ధనవంతులు, ఎగువ మధ్యతరగతికి చెందిన వాళ్లెవరూ లేరని అన్నారు. తాగుడుకు అలవాటు పడ్డవాళ్లు అవసరమైతే ఇళ్లల్లోని వస్తువులను, భార్య పుస్తెళ్ళను సైతం అమ్మేసి మద్యం తాగుతారని అన్నారు. నాణ్యత లేని మద్యం విక్రయించడం, ధరలు పెంచడం వంటివి చాలా ఘోరమని ప్రభుత్వంపై మండిపడ్డారు.  

ఈ నాణ్యత లేని మద్యం తయారీకి కేవలం పదిహేను నుంచి ఇరవై రూపాయల ఖర్చు అవుతుందని, ప్రభుత్వం మాత్రం రూ.150 నుంచి రూ. 250కు విక్రయిస్తోందని, ప్రొడక్షన్ కాస్ట్ కన్నా ఎక్కువ ధరలకు విక్రయించడం క్షమించరాని నేరమని అన్నారు. మద్యం ధరలు పెంచడం వల్ల పేదోడు తాగడనే వాదన అర్థం లేనిదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మద్యం తాగడం అలవాటు ఉన్న ఏ పార్టీలోని వ్యక్తులైనా  ఆ మద్యం తాగితే పరిస్థితేంటో అర్థమైపోతుందని అన్నారు. ‘మీ నాయకులను రెండు మూడ్రోజులు ఆ మందు తాగమనండి.. అర్థమైపోతుందంటూ’  సీఎం జగన్ కు సోమిరెడ్డి సూచన చేశారు.


More Telugu News