ఏపీకి ఎంఫాన్ తుపాను ముప్పు వార్తల్లో నిజం లేదు: వాతావరణ కేంద్రం

  • ప్రతికూలతల వల్ల అల్పపీడనం బలపడలేదు
  • హిందూ మహాసముద్రం నుంచి దూరమైంది
  • రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌కు ఎంఫాన్ తుపాను ముప్పు పొంచి ఉందన్న వార్తల్లో నిజం లేని వాతావరణ శాఖ కొట్టిపడేసింది. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడలేదని, ఫలితంగా ఏపీకి ఎంఫాన్ తుపాను ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అది హిందూ మహాసముద్రం నుంచి దూరం కావడంతో అల్పపీడనం బలహీన పడినట్టు వివరించారు. వచ్చే మూడు రోజుల్లో కూడా ఇది బలపడే అవకాశం లేదని స్పష్టం చేశారు.

కాగా, తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ,  తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News