ఫైనల్ గా కరోనా, మనం కలసి బతకాల్సిందే!: కేసీఆర్

  • ఇది రేపో, ఎల్లుండో సమసిపోయే సమస్య కాదు
  • కరోనా, మనం కలసి బతకాల్సిందే
  • వారం రోజులకు మనం దాటిపోయే గండం కాదు. ఇది మనల్ని వేటాడుతూనే ఉంటది
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ సుదీర్ఘకాలం పాటు ఉండే రోగమని, దానితో కలసి సహజీవనం సాగించక తప్పదని, అది వచ్చి పోయే జలుబు, జ్వరం వంటిదేనని వ్యాఖ్యానించగా, ఆ వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. విపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు జగన్ వ్యాఖ్యలపై విరుచుకుపడుతూ విమర్శలు గుప్పించారు.

ఇక, అవే వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తూ, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని, అందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించగా, నిన్నటి తన మీడియా సమావేశంలో కేసీఆర్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ రేపో, ఎల్లుండో పోయే సమస్య కాదని అభిప్రాయపడిన కేసీఆర్, వైరస్ తో ప్రజలు కలసి బతకాల్సిందేనని అన్నారు.

"ఇక్కడ నేను చెప్పదలచుకున్నది ఏంటంటే, ఇది రేపో, ఎల్లుండో సమసిపోయే సమస్య కాదు. ఫైనల్ గా కరోనా, మనం కలసి బతకాల్సిందే. కొంచెం తెలివి కావాలె. ఉపాయం ఉన్నోడు అపాయం నుంచి తప్పించుకుంటడు. కాబట్టి మనం ఉపాయంతోని బతకాల. ఆ తెలివిని మనం సంపాదించుకోవాలె.

రేపో, ఎల్లుండో... వారం రోజులకు మనం దాటిపోయే గండం కాదు. ఇది మనల్ని వేటాడుతూనే ఉంటది" అని అన్నారు. వైద్యులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.




More Telugu News