టెస్టులు చేయకుండా విదేశాల్లో ఉన్న భారతీయుల్ని తీసుకురావడం ప్రమాదకరం: మోదీకి కేరళ సీఎం లేఖ

టెస్టులు చేయకుండా విదేశాల్లో ఉన్న భారతీయుల్ని తీసుకురావడం ప్రమాదకరం: మోదీకి కేరళ సీఎం లేఖ
  • విమానంలో ఒకరిద్దరికి వైరస్ ఉన్నా దేశానికి ప్రమాదకరం
  • టెస్టులు చేసిన తర్వాతే ప్రయాణానికి అనుమతించాలి
  • ఒకవేళ అలాగే తీసుకొచ్చినా మా వద్ద తగిన వ్యూహాలు ఉన్నాయి
కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో మన దేశస్తులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరందరినీ స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న వారిని కరోనా టెస్టింగ్ చేయకుండా వెనక్కి రప్పించడం చాలా ప్రమాదకరమని... వైరస్ విస్తరించే అవకాశం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తిరువనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ... కరోనా సోకిందా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా, టెస్టులు నిర్వహించకుండా అందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని, ఇది ప్రమాదకరమని చెప్పారు. విమానంలో 200 మంది ప్రయాణికులు ఉంటారని... వారిలో ఒకరు లేదా ఇద్దరికి వైరస్ ఉన్నా, మన దేశానికి ప్రమాదకరమేనని ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశాల్లో ఉన్న మన వారందరినీ వెనక్కి తీసుకురావాల్సిందేనని... అయితే, కరోనా నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉన్న ప్రొటోకాల్ ను పాటించకపోవడం ఆందోళనకరమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ప్రధానికి తాను లేఖ రాశానని... ప్రయాణానికి ముందే వారందరికీ టెస్టులను నిర్వహించాలని, ఆరోగ్యంగా ఉన్న వారిని మాత్రమే వెనక్కి తీసుకురావాలని సూచించానని తెలిపారు. ఒకవేళ వారికి టెస్టులు చేయకుండా తీసుకువచ్చినా... వారిని మెడికల్ గా ఎలా డీల్ చేయాలనే విషయంపై ఒక వ్యూహాన్ని రెడీ చేసుకున్నామని చెప్పారు.

విదేశాల నుంచి వచ్చిన వారిని ఏడు రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ లో ఉంచుతామని... ఏడో రోజు వారికి కరోనా టెస్టులు నిర్వహిస్తామని విజయన్ చెప్పారు. 24 గంటల్లో టెస్టు రిపోర్టులు వస్తాయని, నెగెటివ్ వచ్చిన వారిని ఇంటికి పంపుతామని, అయితే ఇంట్లో కూడా వారు మరో వారం పాటు సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రులకు తరలిస్తామని చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద 40 వేల టెస్టింగ్ కిట్లు ఉన్నాయని తెలిపారు.


More Telugu News