ఆ మద్యం వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

  • ప్రాణాంతకమైన మద్యాన్ని ప్రజల గొంతులో పోస్తున్నారు
  • ఎన్నడూ వినని బ్రాండ్స్ ను ఎక్కడి నుంచి తెచ్చారో?
  • నాణ్యత లేని మద్యానికి ధరలు పెంచారు!
ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే  లిక్కర్ నాణ్యతపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రాణాంతకమైన మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల గొంతులో పోస్తున్నారని ఆరోపించారు.

ఈ దుకాణాల్లో విక్రయించే లిక్కర్ ను వారం రోజులు తాగితే పక్షవాతం వస్తుందని హెచ్చరించారు. ఎన్నడూ వినని బ్రాండ్స్ ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదని విమర్శించారు. నాణ్యత లేని మద్యం తయారు చేసే డిస్టిలరీలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాణ్యతలేని మద్యాన్ని విక్రయించడమే కాకుండా వాటి ధరలు పెంచడం మరింత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.

పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో విక్రయించే పాత బ్రాండ్స్ నే ఇక్కడ కూడా విక్రయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు మద్యం దుకాణాలు తెరిచామని ఏపీ మంత్రులు చెప్పడం సరికాదని అన్నారు. లాక్ డౌన్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసే ఉంచాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగితే ఎంతమంది ‘క్యూ’లో నిలబడతారో మద్యం దుకాణాల వద్ద అంతమంది బారులు తీరారని అన్నారు, నిన్న మద్యం దుకాణాలు తెరవడం వల్లే సర్వేపల్లిలో ముగ్గురు చనిపోయారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.


More Telugu News