పాకిస్థాన్ లో హేయం... పారిశుద్ధ్య కార్మికులుగా క్రైస్తవులే దరఖాస్తు చేసుకోవాలంటూ నిబంధన!

  • మైనారిటీల పాలిట నరకంలా పాకిస్థాన్
  • పారిశుద్ధ్య కార్మికుల నియామకాల్లో మతపరమైన నిబంధన
  • కరోనా వ్యాప్తి నేపథ్యంలో హడలిపోతున్న కార్మికులు
పాకిస్థాన్ లో  మానవ హక్కుల హననం ఏ విధంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైనారిటీ వర్గాలైన హిందువులు, క్రైస్తవులపై అక్కడ జరిగే దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. ఈ సంఘటన కూడా అందుకు నిదర్శనం.

దేశంలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో పారిశుద్ధ్య కార్మికులకు ప్రాణగండంగా మారింది. కరోనా బారినపడుతున్న వారిలో అనేకమంది పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉంటున్నారు. అయితే, పాకిస్థాన్ లో ఓ పత్రికా ప్రకటన మైనారిటీ వర్గాల పరిస్థితికి నిదర్శనంగా నిలిచింది. పారిశుద్ధ కార్మికులు కావాలంటూ పాకిస్థాన్ సైన్యం ఓ ప్రకటన ఇచ్చింది. అందులో, కేవలం క్రైస్తవులే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించారు. దీనిపై సామాజిక ఉద్యమకారులు ఎలుగెత్తడంతో మతపరమైన నిబంధన తొలగించారు.

ఇప్పటికీ పాకిస్థాన్ లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల్లో అత్యధికలు మైనారిటీలే. అక్షరాస్యత లేకపోవడం, ఆర్థిక వనరుల లేమి తరతరాలుగా ఇక్కడి అల్ప సంఖ్యాక వర్గాలను దుర్భర దారిద్ర్యంలో ఉంచుతోంది. పాకిస్థాన్ జనాభాలో క్రైస్తవుల శాతం 1.6 కాగా, అక్కడి పారిశుద్ధ్య కార్మికుల్లో 80 శాతం వారే ఉన్నారు. మిగిలిన 20 శాతం పారిశుద్ధ్య కార్మికులు హిందువులు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడి కార్మికులకు దినదిన గండంలా మారింది. సరైన రక్షణ కవచాలు లేకపోవడంతో ఎక్కడ వైరస్ అంటుకుంటోందనని హడలిపోతున్నారు.


More Telugu News