ఇంకో 50 శాతం మద్యం ధరలు పెంచిన ఏపీ!

  • నిన్న 25 శాతం పెరిగిన ధరలు
  • నేడు మరో 50 శాతం మేరకు పెంచుతూ ఉత్తర్వులు
  • ప్రజలను మద్యానికి దూరం చేసేందుకేనన్న జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో మద్యం ధరలను మరోసారి పెంచింది. నిన్న షాపులను తిరిగి ప్రారంభించిన తరువాత, 25 శాతం మేరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ధరలు పెంచినప్పటికీ, షాపుల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించడం, భౌతిక దూరం పాటించకుండా, జనాలు తోసుకోవడంపై సమీక్షించిన జగన్, మద్యం ధరలను మరింతగా పెంచడం ద్వారా ప్రజలను వైన్ షాపులకు దూరం చేయాలని నిర్ణయించారు.

మరో 50 శాతం మేరకు ధరలను పెంచాలని సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ధరలను పెంచామని వెల్లడించిన స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, పెరిగిన కొత్త ధరలతో ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. దీంతో నిన్న పెరిగిన 25 శాతం కలిపి, మొత్తం 75 శాతం మేరకు ధరలు పెంచినట్లయింది. ఈ నెలాఖరులోగా మరో 15 శాతం మేరకు షాపుల సంఖ్యను తగ్గించాలని కూడా వైఎస్ జగన్ ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నామని రజత్ భార్గవ్ వెల్లడించారు.


More Telugu News