శాస్త్రవేత్తల కల సాకారం... తెలంగాణలో పండిన యాపిల్!

  • కుమురం భీమ్ జిల్లాలోని ధనోరలో పండిన పంట
  • ఐదేళ్ల క్రితమే ప్రయోగాలు ప్రారంభించిన సీసీఎంబీ
  • వచ్చే సంవత్సరం మార్కెట్లోకి తెలంగాణ యాపిల్
తెలంగాణలో యాపిల్ ను పండించాలన్న సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మోలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల కృషి ఫలించింది. సేంద్రియ రైతులతో కలిసి శాస్త్రవేత్తలు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కరమెరి సమీపంలోని ధనోరా గ్రామంలో పంటను పండించారు. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో యాపిల్ సాగునకు కేంద్రే బాలాజీ అనే రైతు పొలం ప్రయోగాత్మకంగా అనువైనదని గుర్తించిన శాస్త్రవేత్తలు, యాపిల్ పంటను పండించారు.

సీసీఎంబీ శాస్త్రవేత్తలు డాక్టర్ ఏ వీరభద్రరావు, డాక్టర్ రమేశ్ అగర్వాల్, ఈ ప్రాంతంలో సర్వే చేసి, అప్పటికే సేంద్రియ పంటలను సాగు చేస్తున్న బాలాజీకి తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు. వాస్తవానికి యాపిల్ పంట పండాలంటే, సంవత్సరంలో కనీసం 400 గంటల పాటు సగటున 4 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాలి. ఇక్కడ ఆ వాతావరణం వుంది.

దీంతో తెలంగాణ కశ్మీర్ గా పేరున్న ధనోరా గ్రామంలో అప్పటికే సేంద్రీయ పంటలు పండిస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని గుర్తించి, అక్కడ పంట సాగు ప్రారంభించారు.  హరిమన్, బిలాస్ ‌పూర్, నివోలిజన్, అన్న, రాయల్‌ డెలిషియస్ తదితర రకాలకు చెందిన 500 మొక్కలు నాటగా, 400 మొక్కలు పెరిగి, చెట్టుకు 25 నుంచి 40 వరకూ కాయలు వచ్చాయి.

ఈ సంవత్సరం లేత చెట్లు కావడంతో కాయ చిన్నదిగా వచ్చిందని, వచ్చే సంవత్సరం మార్కెట్లో అమ్మకానికి పెట్టే సైజులో కాయలు వస్తాయని అంచనా వేస్తున్నామని రైతు బాలాజీ వెల్లడించారు. వచ్చే సంవత్సరమే యాపిల్ పండ్లు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.


More Telugu News