గంటలు... దీపాలు... పూలు... ఇప్పుడు తీర్థం: ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు

  • దేశంలో ఇంకా కరోనా కట్టడి కాలేదు
  • మద్యంపై పునరాలోచన చేయండి
  • ప్రభుత్వానికి రామకృష్ణ లేఖ
లాక్ డౌన్ కారణంగా మూతబడిన మద్యం దుకాణాలను సోమవారం నాడు తిరిగి తెరవడంపై ఆంధ్రప్రదేశ్ సీపీఐ నేత రామకృష్ణ, తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు చేశారు. దేశంలో కరోనా విజృంభణ ప్రారంభమైన తరువాత, తొలుత గంటలు మోగించారని, ఆపై దీపాలు వెలిగించి, అనంతరం పూలు చల్లారని, ఇప్పుడు తీర్థం ఇస్తున్నట్లుగా మద్యం అమ్మకాలు మొదలు పెట్టారని సెటైర్లు వేశారు. కరోనా ఇంకా కట్టడి కాలేదని గుర్తు చేసిన ఆయన, మద్యం విక్రయాలపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు.

ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన ఓ లేఖను రాశారు. నిన్న షాపుల వద్ద కస్టమర్లు లాక్ ‌డౌన్ నిబంధనలు పాటించలేదని, మాస్క్ లు ధరించకుండా కూడా వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన, ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.


More Telugu News