కొనసాగుతున్న కరోనా విజృంభణ.. అమెరికాలో 70 వేలకు చేరువలో మరణాలు

  • అమెరికాలో గత 24 గంటల్లో 1,400 మంది బలి
  • రష్యాలో వరుసగా రెండో రోజూ 10 వేలకు పైగా కేసులు
  • జపాన్‌లో ఎమర్జెన్సీ ఈ నెలాఖరు వరకు పొడిగింపు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లక్షలాదిమందిని బలి తీసుకుంటున్న ఈ మహమ్మారి అమెరికాలో విలయం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 36 లక్షల మంది కరోనా బాధితులుగా మారగా, 2.5 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గత 24 గంటల్లో 1,400 మందికిపైగా మరణించారు. ఫలితంగా ఆ దేశంలో మరణాల సంఖ్య 70 వేలకు చేరువైంది.

రష్యా, ఇరాన్‌, జపాన్, బ్రిటన్, బంగ్లాదేశ్‌లలో కేసులు ఒక్కసారిగా పెరిగాయి. రష్యాలో వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటిలో దాదాపు ఆరువేల కేసులు ఒక్క మాస్కోలోనే నమోదు కావడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. జపాన్‌లో కరోనా చెలరేగుతుండడంతో ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీని ఈ నెలాఖరు వరకు పొడిగించారు. మరోవైపు, బ్రిటన్‌లోనూ కరోనా తగ్గుముఖం పట్టలేదు. కేసులు, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇరాన్‌లో నిన్న 1,223 కరోనా కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో మొత్తం కేసుల సంఖ్య 98 వేలు దాటింది. పొరుగుదేశం బంగ్లాదేశ్‌లోనూ కోవిడ్-19 కేసులు 10 వేలు దాటేశాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 16 వరకు ప్రభుత్వం పొడిగించింది.


More Telugu News