మద్యం కోసం.. సరిహద్దులు దాటి ఏపీకి వస్తున్న మందుబాబులు!

  • తెలంగాణలో తెరుచుకోని మద్యం షాపులు
  • ఏపీలో మొదలైన మద్యం అమ్మకాలు
  • కిలోమీటర్ల మేర బారులుతీరిన మందుబాబులు
మూడో విడత లాక్ డౌన్ సందర్భంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని రాష్ట్రాలు ఇవాళ మద్యం అమ్మకాలు షురూ చేశాయి. అయితే తెలంగాణలో మాత్రం మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. అక్కడ మే 7 వరకు లాక్ డౌన్ ఉన్నందున, మద్యంపై ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.

ఇక అసలు విషయానికొస్తే, ఏపీలో మద్యం షాపులు తెరవడంతో మందుబాబుల హడావుడి అంతాఇంతా కాదు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాకలో ఓ మద్యం దుకాణం వద్ద కూడా భారీగా మద్యం ప్రియులు బారులు తీరారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారిలో అత్యధికులు తెలంగాణ ప్రాంతం వారే.

ఎటపాక రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణ వైపు నుంచి కూడా మందుబాబులు ఇక్కడికి వస్తున్నారు. తెలంగాణకు చెందిన భద్రాచలం నుంచి ఎటపాక అర కిలోమీటరు దూరంలోనే ఉండడంతో ఇక్కడి దుకాణం ముందు కిలోమీటర్ల మేర భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా మందుబాబులు భౌతికదూరం పాటిస్తూ క్యూలో ఓపికగా వేచిచూస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.


More Telugu News