దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుదుటపడడానికి ఏడాది పడుతుంది: సీఐఐ

  • అన్ని జిల్లాల్లో పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలి
  • రెడ్ జోన్లలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి
  • కేంద్రాన్ని కోరిన పరిశ్రమల సమాఖ్య
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా ఉండే అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలంటూ భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేసింది. రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలని పేర్కొంది. లాక్‌డౌన్ జోన్లుగా గుర్తించే విషయంలో జిల్లాల ఆర్థిక ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

కాగా, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని, దేశంలోని 300 పెద్ద కంపెనీల సీఈవోల మధ్య నిర్వహించిన సర్వేలో బయటపడినట్టు సీఐఐ పేర్కొంది. మునుపటి పరిస్థితులు రావడానికి సంవత్సరం పట్టే అవకాశం ఉందని 45 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడినట్టు తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 33 శాతం మంది తమ కంపెనీ ఆదాయం 40 శాతం, అంతకంటే తగ్గొచ్చని చెప్పారని వివరించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంపై జరిగిన అతిపెద్ద సర్వే ఇదని సీఐఐ పేర్కొంది.


More Telugu News